ఆంధ్ర ప్రదేశ్కర్నూలుమీడియావిజయవాడ

వైసీపీ దాష్టీకాలపై పోరాడే సమయం వచ్చింది

Share this Post

ప్రజాక్షేత్రంలో తెగించి సమష్టిగా పోరాడదాం
రాజ్యాధికారం ఎవరి సొంత సొత్తు కాదు
శ్రీ ఆమంచి స్వాములు రాకతో జనసేనకు అదనపు బలం
భారీ బలగంతో శ్రీ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన వైసీపీ నేత శ్రీ ఆమంచి స్వాములు, ఆయన కుమారుడు శ్రీ రాజేంద్ర

‘రాజ్యం.. రాజ్యాధికారం ఎవరి సొంత సొత్తు కాదు. దాన్ని జన్మహక్కులా భావించి ఒక్కరే ఎల్లవేళలా అనుభవిస్తామంటే కుదరదు. పదిమంది కూర్చొని రాష్ట్రాన్ని మొత్తం నడిపిస్తామంటే ఊరుకోబోమ’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు శ్రీ ఆమంచి శ్రీనివాసులు (స్వాములు) శనివారం తన అనుచరులతో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. శ్రీ స్వాములుకు పార్టీ కండువా వేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ ఉన్నతి కోసం పూర్తిస్థాయిలో పని చేయాలని సూచించి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలపై తెగించి పోరాడాల్సిన సమయం వచ్చింది. కలిసికట్టుగా ముందుకు వెళదాం. ఈ పోరాటంలో మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. శ్రీకాళహస్తిలో శ్రీ కొట్టే సాయి అనే జన సైనికుడిపై చేయి వేసిన పోలీసుల తీరును ప్రశ్నించేందుకు సోమవారం తిరుపతి వెళ్తున్నాం. కచ్చితంగా ఈ పోరాటంలో ప్రతి జన సైనికుడుకీ, వీర మహిళకు అండగా నేనుంటాను. ప్రజా సమస్యలపై జగన్ అంటే భయం లేకుండా తెగించి పోరాడుదాం. ప్రజాక్షేత్రంలో నిత్యం ఈ ప్రభుత్వ తీరును ఎండగడదాం. ఈ పోరాటంలో ఎవరిపై దెబ్బపడినా నాపై దెబ్బ పడినట్లే భావిస్తాను. ఈ ప్రభుత్వాన్ని దేహి దేహి అని అడగాల్సిన పరిస్థితి లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను, విధులను కచ్చితంగా వినియోగించుకుందాం. నియంత పాలన చేస్తామంటే కుదరదు. కచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు పాటించి.. మా బతుకులు మేం బతుకుతాం. మా బతుకులను నిర్దేశిస్తామంటే మాత్రం ఊరుకోం. శ్రీ ఆమంచి స్వాములు గారి లాంటి నాయకుల బలమే జనసేనకు కావాలి. తనను నమ్ముకున్న వారి కోసం చివరి వరకు నిలబడే నాయకులు, సమస్యలపై కడదాకా పోరాడేతత్వం ఉన్న శ్రీ స్వాములు జనసేనలో చేరడంతో ప్రకాశం జిల్లాలోనే కాదు.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ పార్టీకి అదనపు బలం చేకూరినట్లయింది. భారీ బలగంతో ఆయన చేరిక పార్టీకి కొత్త ఊపు తెచ్చింది. ఆయన రాకతో నాకు కూడా చిన్ననాటి అనుబంధం ఉన్న చీరాల చిన్నరథం, పెద్దరథం, జాండ్రపేట టక్కున గుర్తొచ్చాయి. ఇక నుంచి మూడు జిల్లాల్లోనూ శ్రీ స్వాములు సేవలు పార్టీ ఉన్నతికి మరింత ఉపయోగపడతాయని భావిస్తున్నాను” అన్నారు.

శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం : శ్రీ నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రాష్ట్రానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.. జనసేన విజయం సాధించాల్సిన అవసరం ఉన్నాయి. ఆ దశగా మనమంతా కృషి చేయాలి. శ్రీ ఆమంచి స్వాములు పార్టీలో చేరడం సంతోషం. సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు ఉన్న శ్రీ స్వాములు లాంటి వ్యక్తుల చేరికతో రాష్ట్రం నలుమూలల పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను” అన్నారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది: శ్రీ ఆమంచి శ్రీనివాసులు
పార్టీలో చేరిన శ్రీ ఆమంచి శ్రీనివాసులు మాట్లాడుతూ “వైసీపీ నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. జగన్ ప్రభుత్వ విధి విధానాలతో ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా మనమంతా ఆయనకు తోడుగా నిలబడాలి. బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ లకు కొండంత అండగా ఉండే జనసేన పార్టీలో చేరడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తాను” అన్నారు.

ప్రకాశం నుంచి వెయ్యి కార్లతో భారీ ర్యాలీ
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నాయకులు శ్రీ ఆమంచి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరిక సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచే కాకుండా విజయవాడ, గుంటూరు నుంచి స్వాములు మద్దతుదారులు భారీగా వెయ్యి కార్లతో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. జనసేన పార్టీ కార్యాలయం స్వాములు మద్దతుదారులతో నిండిపోయింది. జనం భారీగా తరలి రావడంతో కార్యాలయం బయట కూడా ఎల్ఈడీ తెరలు పెట్టి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. జనసేన పార్టీ కార్యాలయం ఉన్న సర్వీసు రోడ్డు అంతా కార్లతో నిండిపోయింది. జనసేన జెండాలతో నిండుగా కనిపించింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో శ్రీ ఆమంచి స్వాములుతో పాటు వైసీపీ విశ్వబ్రాహ్మణ సంఘం అధికార ప్రతినిధి శ్రీ వినుకొండ వెంకట సుబ్బారావు, రెండు తెలుగు రాష్ట్రాల కాపు జేఎసీ గౌరవాధ్యక్షులు శ్రీ బుల్లెట్ ధర్మారావు, డాక్టర్ దండె శివకుమార్, శ్రీ రాయపాటి శ్రీనివాసరావులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *