ఆంధ్ర ప్రదేశ్మీడియా

పేదల ఇళ్ల స్థలాలు… కాలనీలు ఎలా ఉన్నాయో ప్రపంచానికి చూపిద్దాం

Share this Post

  • వర్షాకాలంలో నీట మునిగిన మాట వాస్తవం
  • జగనన్న కాలనీల పరిస్థితిపై జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్
  • శనివారం ఉదయం నుంచి జనసేన నేతలు, శ్రేణులు కాలనీల సందర్శన
  • పేదలకు ఇళ్ల పేరుతో వైసీపీ చేసిన స్కామ్ ని ప్రజలకు తెలియచేద్దాం
  • జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశం
  • పార్టీ నాయకులతో పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్

జగనన్న కాలనీల ముసుగులో వైసీపీ ప్రభుత్వం చేసిన అతి పెద్ద కుంభకోణాన్ని మరోసారి సోషల్ మీడియా క్యాంపెయిన్ రూపంలో జనంలోకి తీసుకువెళ్లాలని జనసేన పార్టీ నిర్ణయించింది. వర్షాకాలంలో జగనన్న కాలనీల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టే విధంగా రాష్ట్రవ్యాప్త క్యాంపెయిన్ కు పిలుపునిచ్చింది. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శనివారం ఉదయం 10 గంటల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలంతా తమతమ ప్రాంతాల్లోని జగనన్న కాలనీలు సందర్శించి అక్కడ పరిస్థితులను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. గురువారం పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జులు, వీర మహిళ ప్రాంతీయ కమిటీ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జగనన్న కాలనీల పేరిట జరిగిన అతిపెద్ద కుంభకోణాన్ని విజయనగరం జిల్లా గుంకలాం ప్రాంతం నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బయటపెట్టగా, అద్భుతమైన డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకు గతేడాది తెలియచెప్పే ప్రయత్నం చేశాం. నిరుపయోగంగా ఉన్న భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ పార్టీ నాయకులు, శాసనసభ్యులు ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెరువుల్ని సైతం ఆక్రమించేసి ప్రభుత్వానికి ఇళ్ల స్థలాలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు.

  • రూ.89 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు

మౌలిక వసతుల కల్పన పేరిట రూ. 89 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఆ కోట్లు ఎటు పోతున్నాయి. ప్రతి జగనన్న కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తామని రకరకాల కబుర్లు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూనే ఉంది. మౌలిక వసతుల పేరిట చేసిన మోసాన్ని ప్రజలకు తెలియచేద్దాం. రోడ్ల నిర్మాణం కూడా స్థానిక ఎమ్మెల్యేల అనుచరులకే పరిమితం అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో లబ్దిదారుల నుంచి రోడ్ల నిర్మాణం పేరిట డబ్బులు వసూలు చేసి ఇబ్బందులు పెట్టడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు నిరసన తెలిపితే పట్టాలు రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడి మరీ బలవంతంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శనివారం పార్టీ శ్రేణులంతా కలసి జగనన్న కాలనీలు సందర్శించి అక్కడ వాస్తవ పరిస్థితులు ఫోటోల రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియచేయండి. ఒక వానకే పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు మునిగిపోయాయి. వైసీపీ చేసిన అతిపెద్ద స్కామ్ ని ప్రజల్లోకి తీసుకువెళ్దాం. జగనన్న కాలనీల పేరిట ఇచ్చిన పట్టాల ప్రహసనం ఒక ఎత్తయితే.. తరవాత ప్రజల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారన్న విషయాన్ని లబ్ధిదారులు చాలా సందర్భాల్లో పార్టీ దృష్టికి తీసుకు వచ్చారు. పార్టీ నాయకులతోపాటు జనసైనికులు, వీర మహిళలు జగనన్న కాలనీల్లో పర్యటించి ప్రజలకు వాస్తవాలు తెలుపుదాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి” అన్నారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *