ఆంధ్ర ప్రదేశ్జాతీయంమీడియా

మెడికల్ సీట్ల పక్కా విక్రయాలు!

Share this Post

  • కేటగిరీల పెంపు, లక్షల్లో ‘వసూళ్లు’
  • ఇదేం విధానం ముఖ్యమంత్రీ?
  • వైద్యవిద్య సామాన్యులకు మిధ్యేనా…

‘మొత్తం విద్యావ్యవస్థనే సమూలంగా మార్చేస్తాం. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఆశలన్నీ నెరవేరుస్తాం’ అని ప్రకటించిన ఏపీ సీఎం జగన్… ఇప్పుడు మాట తప్పారు, మడమ తిప్పారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా, వైద్య విద్యను అమ్మకానికి పెట్టింది ఆయన ప్రభుత్వం! కొత్తగా ఏర్పాటైన ఐదు మెడికల్ కాలేజీల్లో 50శాతం- అంటే సగం సీట్లను కోటీశ్వరులకే కట్టబెట్టే ‘పరిస్థితి’ తెచ్చింది. దీన్ని పేదవర్గాల వారెవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. రిజర్వుడు సీట్లు సగానికి తగ్గిపోతుండటాన్ని ఎవ్వరూ భరించలేకపోతున్నారు. వైకాపా ప్రభుత్వ పాలన అంతా ‘జిత్తుల మాటలు- తప్పుడు చేతలు’ అని తీవ్రంగా నిరసిస్తున్నారు.

*కోటాల మాయాజాలం
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నిర్వహణలో ఉన్నాయి. ఇప్పటికే ఉన్నవి 12 కాగా, అదనంగా 5 కాలేజీలను విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, నంద్యాల ప్రాంతాల్లో ఆరంభించారు. వీటిల్లో ఒక్కోచోట 150 వంతున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం సరిగ్గా అక్కడే అమ్మకాలకు తెరతీసింది! ఈ కొత్త 5 కాలేజీల్లో ఫీజులపరంగా ‘ఎ’ (కన్వీనర్ కోటా) తోపాటు సరికొత్తగా బి, సి కేటగిరీలను తగిలించింది. అంటే- ‘ఎ’ కేటగిరీలో ఫీజు రూ.15,000 అయితే; సెల్ఫ్ ఫైనాన్స్ గా ‘బి’ కేటగిరీకి ఫీజు ఏటా రూ.పన్నెండు లక్షలు! అలాగే ‘సి’ కేటగిరీగా నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్నారై)లో వార్షిక ఫీజు ఏకంగా రూ.ఇరవై లక్షలు! నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)లో ఈసారి 48,836 మంది అర్హత పొందారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కాబట్టి, సీట్లన్నింటినీ కన్వీనర్ కోటాలోనే భర్తీ చేస్తారనుకున్నారు. కానీ అన్ని వేలమంది విద్యార్థినీ విద్యార్థుల, వారి తల్లిదండ్రుల ఆశలనూ కుప్పకూలుస్తూ జగన్ ప్రభుత్వం నూతన నిర్ణయాలు తీసుకుంది. దీంతో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలవారు దిక్కుతోచని స్థితికి చేరారు.

  • డొనేషన్ల తరహా ఫీజులు
    జాతీయ కోటా కింద 15 శాతం సీట్లు భర్తీ అవుతాయి. కొత్త కాలేజీల్లోని సీట్లు 750 కాబట్టి, ఆ మేరకు 112 సీట్లు జాతీయ కోటా కిందకు వెళతాయి. మిగిలిన సీట్లు 638. వాటిల్లో 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. అందులో 25 శాతం సీట్లు జనరల్ కాగా, మరో 25 శాతం రిజర్వేషన్. మిగిలి ఉన్న 50 శాతం సీట్లలో 35 శాతం ‘బి’ కేటగిరీ, 15 శాతం ఎన్నారై కోటాలోనివి. కన్వీనర్ కోటా పరంగా సంవత్సర ఫీజు రూ.పదిహేను వేలే! మరి బి, సి కేటగిరీల ఫీజులు మాత్రం లక్షల రూపాయల్లో! కేటగిరీలవారీగా ‘బి’లో 223, ‘సి’లో 96 (మొత్తం 319 సీట్లు). వీటి భర్తీకే… పనిగట్టుకుని ఫీజుల రూపంలో లక్షలాది రూపాయల వసూళ్లకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం! కొత్త కాలేజీలకు సంబంధించి, రిజర్వుడు సీట్లు సగానికి తగ్గిపోయినట్లే. దీనివల్ల ఇంకా పలు విధాలుగా బాధితులయ్యేది పేద యువకులే. వైకాపా హయాంలో మెడికల్ సీట్లు కోటీశ్వరులకే కానీ, సామాన్యులకు కాదన్న మాట. ఈ రీతిలో డొనేషన్ల తరహా ఫీజుల వసూళ్లంటే, వైద్యవిద్య అంతటినీ విక్రయించేయడం! సాక్షాత్తు పాలకులే జిత్తులమారి మాటలతో, తప్పులతడక చేతలతో సమస్త వైద్యవిద్యా వ్యవస్థనూ ధ్వంసం చేస్తున్నారు.

*ప్రైవేటుకు దీటుగా….

ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలన్న తేడా ఇక లేనట్లే! కొత్త కాలేజీల్లో పేద అభ్యర్థులకు కేటాయించినవి కేవలం 25 శాతం సీట్లు మాత్రమే. ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజులు తడిసి మోపెడంత. అందువల్ల మరింత మెరుగైన ర్యాంకు సాధించేలా, ప్రభుత్వ కాలేజీలో సీటు సాధించేలా… ఇంకోసారి నీట్ పరీక్ష రాసేందుకు పలువురు దీర్ఘకాలిక శిక్షణ తీసుకుంటున్నారు. ఇంతలో ప్రభుత్వమే నయా వ్యాపారానికి తెగబడటంతో, నిరసన తీవ్రత పెల్లుబుకుతోంది. నూతనంగా మెడికల్ కాలేజీలు వస్తే సీట్లు పెరుగుతాయన్న ఆశకు జగన్ సర్కారే గండికొట్టిందన్నది విమర్శ. ఫీజుల ఆధారంగా సీట్ల భర్తీ ఏమిటని అనేకులు నిలదీస్తున్నారు. ‌‌


*అసలు సిసలు వ్యాపార వ్యవహారం

జగన్ తరహా పాలన ధోరణి దేశంలో ఇంకెక్కడా కనిపించదని ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆక్షేపించింది. ప్రభుత్వ సీట్లను తెగనమ్ముకోవాలన్న ఆలోచనే తప్పు అని నిరసించింది. కన్వీనర్ కోటాలో సీట్లకు విపరీతంగా కోతపెట్టడం, సీట్లకు కేటగిరీలను సృష్టించి వ్యాపార సంస్కృతిని పెంచి పోషించడం సరికాదంది. మెడికల్ సీట్ అంటూ వస్తే, ఎవరైనా మొదట ప్రభుత్వ కళాశాల వైపే చూపు సారిస్తారు. ప్రైవేటు కాలేజీలా అక్కడ ఫీజుల మోత ఉండదన్నదే వారి నమ్మకం. దాన్ని నిలబెట్టుకోవాల్సింది పాలకులే! ఇంతా చేసి కొత్త కాలేజీల సీట్లను అమ్ముకుంటే, ఏటా వచ్చే ఆదాయం రూ.45 కోట్ల లోపే ఉంటుంది. ప్రభుత్వం చేయాల్సిన వ్యయంలో అది ఏ మూలకి …అని కూడా ప్రశ్నిస్తున్నారు జూడాలు.

*వింత, వితండ వాదన

వైకాపా ఇప్పటికీ తనదైన శైలిలో సమర్ధించుకుంటోంది. వైద్యవిద్యకు అవకాశాలు రాష్ట్రంలో బాగా పెరుగుతున్నాయంటోంది. వైద్యవిద్యలో ప్రవేశాల కోసం పలువురు ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్తున్నారని; ఆ వలసల నిరోధానికే నూతన విధానం తెచ్చామని నమ్మబలుకుతోంది. మెడికల్ కాలేజీల, సీట్ల సంఖ్య పెరగడంతో- కొత్తవాటి నిర్వహణ సక్రమంగా సాగేందుకే ఇదంతా… అంటోంది. ఆయా కళాశాలలకు ఏటా తలా రూ.225 కోట్లు అవసరం. పాతవి 12, నూతనంగా వచ్చిన 5 మొత్తం 17 కాలేజీలకూ కలిపి… ఆ మేర ప్రతీ ఏటా రూ.3,825 కోట్లు కావాలని లెక్కలు వల్లిస్తోంది. అందుకే ఫీజుల పెంపు తప్పలేదని అంటోంది. కానీ, పేద విద్యార్థినీ విద్యార్థులకు వైద్యవిద్య ఏపీలో అందకుండా పోతోంది‌. పాలకుల జిత్తుల మాటలు, తప్పుడు చేతలు ఇంకెన్నాళ్ళో మరి!


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *