పేదలకు మంచి చేస్తే సీఎం నేల మీద ఎందుకు తిరగలేరు?
- హక్కులు లేని చోట పట్టాలు, శంకుస్థాపనలంటూ మోసం
- గో బ్యాక్ జగన్ రెడ్డి.. జనసేన ఆధ్వర్యంలో నిరసన
హక్కులు లేని చోట పట్టాలు, శంకుస్థాపనలు అంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేద ప్రజల్ని మోసం చేస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. ప్రజల్ని మోసం చేసేందుకు హెలీకాప్టర్లో బయలుదేరిన ముఖ్యమంత్రి పర్యటనను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపేందుకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీ గాదె మాట్లాడుతూ.. మొన్నటి వరకు ఒక మంత్రి అమరావతి స్మశానం అన్నాడు., మరో మంత్రి ఎడారి అన్నాడు.. ఇంకొకరు ముంపు ప్రాంతమని మాట్లాడారు.. ఇప్పుడు అదే ప్రాంతంలో ఏ ముఖం పెట్టుకుని పేద ప్రజలకు భూములు ఇస్తున్నారో చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం ఇంచే సెంటు స్థలంతో అక్కడ ప్రజలు కోటీశ్వరులు అయిపోతారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యమంత్రి పేద ప్రజల్ని మోసం చేసేందుకు బయలుదేరారు. పేదల భూముల నెపంతో రాజధానిని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి వెనుక ఉన్న ప్రాంతానికి కూడా హెలీకాప్టర్లో వెళ్లడం ఎందుకు? పేద ప్రజలకు మంచి చేస్తే నేల మీద ఎందుకు నడవలేరు అని ప్రశ్నించారు. కృష్ణాయపాలెంలో జరగనున్న శంకుస్థాపన కార్యక్రమం వద్ద ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలియచేస్తామన్నారు. పోలీసు వారు సహకరించాలని శ్రీ గాదె కోరారు. అనంతరం సీఎం గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యకర్గం సభ్యులు పాల్గొన్నారు.
