శ్రీ వసంత కుమార్ మరణం బాధాకరం
శ్రీకాకుళం జిల్లా పొందూరులో విద్యుత్ ప్రమాదానికి గురై జనసేన క్రియాశీలక కార్యకర్త శ్రీ గొర్ల వసంత కుమార్ మరణించడం చాలా బాధ కలిగించిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. 27 ఏళ్ల వసంత కుమార్ ప్రజా సేవలో చురుకుగా ఉంటాడు. విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని కంప్లైంట్ చేయటానికి వీడియో తీస్తుండగా ఈ ప్రమాదం జరిగి మరణించడం శోచనీయం. గతంలో కూడా ఇదే విషయమై పలుమార్లు విద్యుత్ అధికారులకు వసంత కుమార్ ఫిర్యాదు కూడా చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగటం విచారకరం. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక జనసేన నాయకులు చెబుతున్నారు. ఏమైనప్పటికీ ఇటువంటి ప్రమాదం జరగటం, 27 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోవడం ఎంతైనా బాధాకరం. వసంత కుమార్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. జనసేన పార్టీ తరఫున వసంత కుమార్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా పరిహారాన్ని త్వరలోనే అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.
