జోగి రమేష్ వ్యాఖ్యలపై వరుసగా రెండో రోజూ నిరసన జ్వాలలు
- మంత్రికి చీర, సారె పెట్టేందుకు పెడన బయలుదేరిన వీర మహిళలు
- అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై మంత్రి జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. అసభ్యకర వ్యాఖ్యలు, చేతగాని మాట్లాడుతున్న జోగి రమేష్ కి చీర, సారె పెట్టి నిరసన తెలియచేస్తామంటూ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో ఛలో పెడన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వీర మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యులు శ్రీమతి రావి సౌజన్య, శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి జిల్లావ్యాప్తంగా వీర మహిళలు, నాయకులతో కలసి వివిధ మార్గాల్లో పెడన బయలుదేరారు. వీరిని గూడూరు శివార్లలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. వీరిద్దరినీ మొదట పామర్రు పోలీస్ స్టేషన్ కి తర్వాత జాతీయ రహదారిపై తిప్పుకుంటూ ఉయ్యూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అరెస్టు విషయం తెలుసుకున్న పామర్రు నియోజకవర్గ పార్టీ నాయకుడు శ్రీ తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉయ్యూరు పోలీస్ స్టేషన్ కు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. సాయంత్రం 4.30 గంటల తర్వాత వీరిని విడుదల చేశారు. వీర మహిళలకు మద్దతుగా పెడన నియోజకవర్గానికి చెందిన పలువురు జన సైనికులు శ్రీ ఎస్వీ బాబు ఆధ్వర్యంలో పెడన చేరుకునే ప్రయత్నం చేయగా., పోలీసులు 14 మందిని అరెస్టు చేసి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కి తరలించారు. మచిలీపట్నం ఇంఛార్జ్ శ్రీ బండి రామకృష్ణ, పార్టీ నాయకులు శ్రీ కొరియర్ శ్రీనివాస్ తదితరులు స్టేషన్ కి చేరుకుని అక్రమ అరెస్టులను ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న పార్టీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారంటూ పోలీసులను ప్రశ్నించారు. అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే సాయంత్రం 5.30 గంటల వరకు పోలీసులు వారిని విడిచిపెట్టేందుకు అంగీకరించలేదు. జనసేన శ్రేణుల నిరసనల నేపధ్యంలో పెడనలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
