ఆంధ్ర ప్రదేశ్తిరుపతివిజయవాడ

గిరిజన బాలికల అత్యాచారం కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేలా సెక్షన్లు పెడతారా?

Share this Post

• విజయవాడ పోలీస్ కమిషనర్ సమాధానం చెప్పాలి
• నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రవీంద్రరెడ్డి అఘాయిత్యాలపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నోరు పెగలదా?
• బాధితురాలిని పరామర్శించిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్

‘ఎన్నో కలలతో, కష్టాల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి నర్సింగ్ విద్యను అభ్యసించేందుకు గిరిజన బాలికలు విజయవాడ నగరానికి వస్తుంటారు. అభంశుభం ఎరుగని ఆ ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతూ, వారిని లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ నవోదయ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రరెడ్డిపై పోలీసులు తూతూమంత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం శోచనీయం’ అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారాలు చేసిన రవీంద్రరెడ్డి మీద స్టేషన్ బెయిల్ పొందే సెక్షన్లు నమోదు చేయడం గురించి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతి రాణా టాటా సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. నవోదయ కళాశాలలో లైంగిక దాడులకు గురై, పాత ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని బుధవారం శ్రీ మహేష్ పరామర్శించారు. బాలికకు ధైర్యం చెప్పారు. కేసులో ఎంతటి వారున్నా వదిలేది లేదని, బాలికలకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాడుతుందని భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా శ్రీ పోతిన మహేష్ మాట్లాడుతూ ‘‘సీఎం సొంత జిల్లా కడప జిల్లాకు చెందిన రవీంద్రరెడ్డి గిరిజన బాలికలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినా, ఇప్పటి వరకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ నోరు విప్పకపోవడం ప్రభుత్వ దుర్నితీకి తార్కాణం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ శ్రీ రుహుల్ల కార్యాలయాలకు కూత వేటు దూరంలోనే ఉన్న నవోదయ నర్సింగ్ కళాశాలలో గిరిజన మైనర్ బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలపై నాయకులెవరూ స్పందించకపోవడం దుర్మార్గం. విపక్షాలపై రాజకీయ విమర్శలు చేయడానికి ముందుండే వైసీపీ నాయకులు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్ లకు ఆడబిడ్డల కన్నీటి వ్యధ కనిపించలేదు.
గిరిజన బాలికలపై లైంగిక ఆకృత్యాలకు నిలయమైన నవోదయ నర్సింగ్ కళాశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలి. అక్కడ చదువుతున్న విద్యార్థినిల భవిష్యత్తును భద్రంగా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. 100 మంది బాలికలు చదువుతున్న నర్సింగ్ కళాశాలలో సీసీటీవీలు ఏర్పాటు చేయకపోవడం చూస్తే, ఓ ప్రణాళిక ప్రకారమే ఈ దుశ్చర్యలు చేసినట్లు అర్ధం అవుతోంది. వెంటనే ప్రిన్సిపల్ రవీంద్రరెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి, అరెస్టు చేయాలి. కళాశాలలో ఏం జరిగిందో సమగ్ర దర్యాప్తు చేయాలి. గిరిజన బాలికల కన్నీటి వెతలను అర్ధం చేసుకొని అధికారులు, పాలకులు తగిన విధంగా స్పందించాలి’’ అన్నారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *