జనసేన పార్టీ కోసం ఓ సైనికుడిలా పనిచేస్తా : శ్రీ పంచకర్ల రమేష్ బాబు
శ్రీ పవన్ కళ్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ పంచకర్ల రమేష్ బాబు
ఈ నెల 20వ తేదీన పార్టీలో చేరిక
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ఆదివారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం శ్రీ పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ… “జనసేన పార్టీ భావజాలం, రాష్ట్ర శ్రేయస్సు కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పడుతున్న తపన చూసి నేను కూడా ఒక సైనికుడిలా ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నాను. అదే విషయం ఆయనతో చెప్పాను. ఈ నెల 20వ తేదీన నా అనుచరులతో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పార్టీలో జాయిన్ అవుతాను. పార్టీ ఉన్నతి కోసం కృషి చేస్తాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తాను” అన్నారు.
