ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర

అసెంబ్లీకి వ‌స్తాం , సీఎం పోస్టు సంగ‌తేందో తేలుస్తాం .. క‌త్తిపూడి స‌భ‌లో ప‌వ‌న్

Share this Post

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభమైంది. ఇవ్వాల (బుధవారం) సాయంత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్నవరం స‌త్య‌దేవుని స‌న్నిధి నుంచి ఆయ‌న ఈ యాత్ర ప్రారంభించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకర్గంలోని కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ వారాహి వాహనం పై నుంచి ప్రసంగించారు.

“ఎంతసేపూ.. నువ్వు విడిగా రా.. నువ్వు విడిగా రా! అంటారు. నేను విడిగా వస్తానో, ఉమ్మడిగా వస్తానో ఇంకా నిర్ణయించుకో లేదు. ఆ సమయం వచ్చినప్పుడు కుండబద్దలు కొట్టినట్టు చెబుతాను. కానీ, ఒక్క విషయం.. వచ్చే ఎన్నికల్లో గెలిచి నేను అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిందే.. పెడతాను. దాని కోసం ఎన్ని వ్యూహాలైనా అనుసరిస్తాం. ముఖ్యమంత్రి పదవిని ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాం. ముఖ్యమంత్రి పదవి మనకు రావాలంటే ఏం చేయాలి, ఎలా వెళ్లాలి అనేది మాట్లాడుకుందాం”అని సభా వేదిక నుంచి పవన్ తన మనసులో మాట చెప్పారు.

జనసేనాని ప్రసంగం హైలైట్స్

గత 2 రోజులుగా పార్టీ కేంద్ర కార్యాలయంలో యాగం చేశాం. ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా అభివృద్ధి సంపూర్ణంగా జరగాలని యాగం చేసి దిగ్విజయంగా పూర్తి చేసి వారాహి విజయ యాత్ర మొదలు పెట్టాను.

ఈ 10 సంవత్సరాలు ఒక పార్టీని స్థాపించి, నడిపించడం అంతా సులువు కాదు. లక్షల కోట్లు ఉన్నా గెలుపు, ఓటములకు అతీతంగా నడపలేము, మీలాంటి వారు అభిమానం, భావజాలాన్ని అర్దం చేసుకుని నడిచే వ్యక్తుల వల్ల నడపగలిగాను.

ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన ఎర్నేస్తో చే గువేరా గారి పుట్టిన రోజు. యాదృచ్ఛికంగా ఈరోజు యాత్ర ప్రారంభించాను. నాకు రాజకీయాలకు స్ఫూర్తినిచ్చిన వారిలో అతను ఒకరు. చే గువేరా లో నాకు నచ్చింది, కష్టాల్లో ఉన్నవారు తన జాతి, కులం, మతం, దేశం కాకపోయినా సరే వారి కోసం పోరాటం చేసి అమరులయ్యారు, ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను

నన్ను పాలించేవాడు నాకంటే నిజాయితీపరుడు అయి ఉండాలి. ఒక సామాన్యుడి అవినీతి చేస్తే ACB పట్టుకుంటుంది, CM అవినీతి చేస్తే ఎవరు పట్టుకుంటారు? నేను మీ భవిష్యత్తు కోసం వచ్చాను మన హక్కుల కోసం గళం ఎత్తాలి పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు అని, భీమవరం లో ఓట్ల జాబితా కంటే 8 వేల ఓట్లు ఎక్కువ పోలయ్యాయి, అవి ఎక్కడ నుండి వచ్చాయి, అందరూ నామీద కక్ష కట్టి ఓడించారు

ఈసారి నన్ను గెలవకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను, ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ బలమైన సంతకం చేస్తుంది , అసెంబ్లీలోకి అడుగుపెట్టి తీరుతాను 151 సీట్లు ఉన్న పార్టీ ఒక్క సీట్ కూడా లేని జనసేన అంటే ఎందుకు భయపడుతుంది, ఎందుకు అణచి వేయడానికి ప్రయత్నిస్తుంది? అంటే మనం బలం వారికి తెలుసు, YSRCP కి పోటీ మనమే. దశాబ్దాలుగా ఉన్న పార్టీలు కూడా YSRCP నాయకులకు బయటపడితే మనం చెప్పు తీసి చూపించాం, అది మన బలం ముఖ్యమంత్రి YS Jagan కు చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు నన్ను ఎలా ఆపుతారో చూస్తాను

మాట్లాడితే YS Jagan క్లాస్ వార్ అని ముసిముసి నవ్వులు నవ్వుతూ మాట్లాడుతాడు, క్లాస్ వార్ అంటే పేద, ధనిక మధ్య వ్యత్యాసం, జగన్ రెడ్డితో పోలిస్తే నేను చేయాలి ఆయన మీద క్లాస్ వార్ వేల కోట్లు అవినీతి సంపాదన, మైనింగ్ కంట్రక్తులు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న వ్యక్తి క్లాస్ వార్ అంటే ఎలా

ఈ సంవత్సరం 18సంవత్సరాలు నిండి ఓటు హక్కు తెచ్చుకున్న యువతకు ఒక్కటే విన్నపం. ఒక మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 56 రోజుల ఆమరణ నిరాహారదీక్ష, ఆత్మ బలిదానం వలన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అది మనం గుర్తు ఉంచుకుని, ఆయన ఆశయాల కోసం పనిచేయాలి

నేను కేవలం సంపాదన కోసం సినిమాలు చేయడం లేదు, పార్టీని నడపడానికి డబ్బు అవసరం కాబట్టి సినిమాలు చేస్తున్నాను సినిమా టిక్కెట్లు విషయంలో కూడా దిగజారిన వ్యక్తి జగన్ రెడ్డి, ఆదాయ వనరులను దెబ్బ కొట్టాలి, పార్టీకి ఆర్థిక సహకారం లేకుండా చేయాలని ప్రయత్నించిన వ్యక్తి జగన్ రెడ్డి

నా బిడ్డల కోసం దాచిన సొమ్ముతో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశాను, మీరు నా బిడ్డలు అనుకుని, మీ భవిష్యత్తు కోసం నా బిడ్డల భవిష్యత్తు పణంగా పెట్టాను, రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలన్నీ మంగళగిరి నుండి సాగుతాయి

వచ్చే ఎన్నికల్లో ఒక్కడిగా పోటీ చే అంటారు…ఒక్కడిగా వస్తానా, కూటమిగా వస్తానా, ఇంకా నిర్ణయించుకోలేదు, ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్న రోజు కుండబద్దలు కొట్టినట్టు చెప్పి ఎన్నికలకు వెళ్తాము

వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని వ్యూహాలైనా వేస్తాను, ముఖ్యమంత్రి పదవి వస్తే స్వీకరిస్తాను, ముఖ్యమంత్రి పదవి కోసం ఎలా పనిచేయాలి అనే దానిపై దృష్టి పెడదాం

వైసీపీ నాయకులు చేసే తప్పుల గురించి చదివి చదివి అలుపోచ్చింది, అన్ని తప్పులు చేశారు

జగన్ రెడ్డి గెలిచాక ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే ఆయనకు ఫోన్లో చాలా మనస్పూర్తిగా అభినందనలు చెప్పి, నేను మీ వ్యక్తిగత జీవితం, విషయాల గురించి మాట్లాడను, మంచి పరిపాలన ఇవ్వండి అని చెప్పాను, కానీ భవన నిర్మాణ కార్మికుల గురించి తప్పు జరుగుతుంది అని మాట్లాడితే నా ఇంట్లొ ఉన్న 4 ఏళ్ల బిడ్డను కూడా వదలకుండా తిట్టించిన వ్యక్తి జగన్ రెడ్డి

ముఖ్యమంత్రి తో సహా ఉచ్ఛం, నీచం లేకుండా నన్ను తిట్టారు. అంత తప్పు నేను ఏమి చేశాను? ప్రజల కోసం పనిచేయడం తప్పా?

దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో నేను ఒకడిని… నాకు YSRCP నాయకులతో తిట్టించుకోవాల్సిన కానీ ప్రజలు నాకు ముఖ్యం అనుకుని కదా నేను రాజకీయ పార్టీ పెట్టి మీ కోసం పోరాడుతోంది

పవన్ కళ్యాణ్ ఓడిపోగానే తోక ముడుచుకుని పార్టీ మూసేస్తాడు, రాజకీయాలు వదిలేస్తాడు అనుకున్నారు, కానీ 2 చోట్ల ఓడిపోయినా సరే నేను నిలబడ్డాను, 10సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను, ప్రజల కోసం నిలబడ్డాను రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సమస్య, రోడ్ల దుస్థితి గురించి జాతీయ స్థాయిలో ఉద్యమం చేసింది జనసేన

మేము వస్తున్నామంటే సెక్షన్ 30అంటారు, పోలీసులు ఆంక్షలు పెడతారు, ఎందుకు మాకు ఇన్ని నిబంధనలు? YSRCP నాయకులకు నిబంధనలు వర్తించవా

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని కత్తిపూడి సభ సాక్షిగా చెప్తున్నాను

నేను గత ఎన్నికల ముందు చెప్పాను YSRCP నాయకులను ఎన్నుకుంటే విశాఖను దొచేస్తారు అని, ఎందుకంటే హైదరాబాద్ లో జగన్ రెడ్డి కుటుంబం ఏం చేసిందో నాకు తెలుసు. ఇప్పుడు కొండలతో సహా దోచేశారు, కనీసం గాజువాకలో నన్ను గెలిపించి ఉంటే నేను అడ్డుకునే వాడిని

నవరత్నాలు అని చెప్పి మాయ చేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు మద్యం నుండి 25 వేల కోట్లు ఆదాయం సంపాదిస్తున్నారు, ఇదేనా నవరత్నాలు

నేను కులాలకు వ్యతిరేకం కాదు, కానీ ఒక్క కులానికి మాత్రమే పదవులు ఇవ్వడం తప్పు, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఒక్క కులానికి పట్టం కట్టే వ్యవస్థను తీసేసి అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తాం

అధికారం లోకి రాక ముందు అమరావతి రాజధాని అని చెప్పి, ఇప్పుడు ఎందుకు మాట మార్చారు? ఆరోజు ఎందుకు ఇది ఒక కులానికి చెందిన వ్యక్తులు ఉన్నారు అని చెప్పకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి మాటలు మార్చే వ్యక్తి. అమరావతిలో అన్ని కులాల రైతులు ఉన్నారు, కానీ ఒక వర్గానికి అంటగట్టి డ్రామాలు వేస్తున్నారు –

పెళ్లి కానుకలు ఇస్తాం అని చెప్పి ఇవ్వట్లేదు, రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. జనసేన అధికారంలోకి వస్తే కొత్తగా పెళ్ళైన ప్రతీ జంటకు మ్యారేజ్ సర్టిఫికేట్ తో పాటు రేషన్ కార్డ్ ఇచ్చే భాధ్యత మాది

సంక్షేమ పథకాలు ఉండాలి. ఆత్మహత్య చేసుకున్న ప్రతీ కౌలు రైతుకు నేను లక్ష రూపాయల ఆర్థిక సాయం నా కష్టార్జితం ఇచ్చాను. ఇది నాకు తెలిసిన సంక్షేమం. ఒక బీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలు చేసి సంపాదించి నేను ఇవ్వగలిగాను. కానీ ముఖ్యమంత్రి సంపద క్రియేట్ చేయకుండా, ప్రజల సొమ్మును బటన్ నొక్కి ఇస్తే అది సంక్షేమం కాదు

చిన్నపాటి నిర్మాణం చేసుకోవాలన్నా YSRCP నాయకులు లంచాలు అడుగుతున్నారు. ఆదాయ వనరులు క్రియేట్ చేయకుండా, అప్పులు చేసి సంక్షేమం అంటాడు ఈ ముఖ్యమంత్రి, పాలన చేతకాక పాపం పసివాడిని, నేను అమాయకుడిని, అందరూ కలిసి నాకు వ్యతిరేకంగా వస్తున్నారు అంటారు.

సొంత చిన్నాన్న ను చంపిన వ్యక్తులను వెనకేసుకు వచ్చే వ్యక్తి ముఖ్యమంత్రి ఆయన పసివాడు ఎలా అవుతాడు? చెల్లి సునీత తండ్రి చావుకు న్యాయం చేయాలని పోరాడుతోంది, చనిపోయిన రోజు ఈ పెద్దమనిషి గుండె పోటు అని డ్రామాలు ఆడారు

ఒక్క ముఖ్యమంత్రి కుటుంబంతో అవినీతి ఆగలేదు, ఆయన అడుగుజాడల్లో క్షేత్రస్థాయిలో అవినీతి చేస్తున్నారు, ఎలా తట్టుకోవాలి ప్రత్తిపాడు లో ఎందుకు అభివృద్ధి లేదు? ఇక్కడ తీర ప్రాంతం ఉంది, పరిశ్రమలు ఎందుకు రావట్లేదు ఆలోచించండి

2014 నుండి 2019 వరకు నేను మీకోసం పోరాడితే నన్ను నమ్మకుండా ఈ ముఖ్యమంత్రి ను నమ్మి గెలిపించారు, మరి ఆయన ఏం చేశాడు, కనీసం విద్యార్థులకు ఫీజ్ రీ ఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోయారు

2019 ఎన్నికల సమయంలో ఈ ముఖ్యమంత్రి అమలాపురం వచ్చి నేను కాపులకు BC రిజర్వేషన్ ఇవ్వను, నాకు కాపుల ఓట్లు అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడితే, 60 శాతం పైగా కాపులు ఆయనకే ఓట్లు వేశారు, కాపు నాయకులు ఆయనకు అండగా ఉన్నారు. నేను అన్ని కులాలకు అండగా ఉంటాను, నా కులం నుండి పారిపోను, కులాల వారిగా దామాషా పద్దతి ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేస్తాను

నన్ను చాలా సార్లు SC , BC నాయకులతో తిట్టిస్తారు, కావాలని కులాల మధ్య గొడవలు పెట్టడానికి చూస్తారు. నేను ఒక వ్యక్తి తిడితే పార్టీ వ్యక్తి తిట్టాడు అని చూస్తాను, ఒక కులం వ్యక్తి తిట్టాడు అని భావించను. కాబట్టి అందరూ అర్దం చేసుకోవాలి. కానీ YSRCP వాళ్ళు కులాల మధ్య చిచ్చు పెడతారు

ఎన్నికలు వస్తున్నాయని YSRCP వాళ్ళు వారు BC సభలు పెడతారు. స్థానిక ఎన్నికల్లో 34% ఉన్న ప్రాతినిధ్యం 24% కి తగ్గించారు, దాదాపు 16,800 మంది బీసీ నాయకులకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇది బీసీలకు న్యాయం చేస్తూన్నట్లా

ఓట్లు వేసేటప్పుడు కులాల పరంగా విడిపోకుండా ఓట్లు వేయాలి. 56 BC కార్పొరేషన్లు పెట్టారు కానీ నిధులు ఇవ్వలేదు, నామమాత్రపు నిధులు ఇచ్చినా వేరే పథకాలకు మరలిస్తున్నారు

జనసేన షణ్ముఖ వ్యూహం ద్వారా టాలెంట్ ఉండి, ఉపాధి కల్పించే ప్రణాళిక ఉండి, పెట్టుబడి లేక ఇబ్బందులు పడే యువతకు ప్రతీ నియోజకవర్గం నుండి 500 మంది యువతకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ క్రింద 10లక్షలు ఇస్తాము

నేను నిలబడే చోట 200 కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు, అదంతా దోచేసిన డబ్బు, అలాంటి దోపిడీలు ఆపేసి యువత కోసం ఖర్చు పెడతాం

పంచాయితీలకు నిధులు లేవు. ఆఖరికి జీతాలకు డబ్బుల్లేక సర్పంచ్ వెళ్లి చెత్త వెత్తే పరిస్థితులు ఉన్నాయి, పంచాయతీ వ్యవస్థను దిగజార్చారు

కేరళలో పంచాయితీ వ్యవస్థ ఎంతో అభివృద్ధి చేశారు, నిధులు ఉన్నాయి. ఇక్కడ చెత్త మీద కూడా పన్ను వేస్తారు కానీ నిధులు ఇవ్వరు. జనసేన అధికారంలోకి వస్తే పంచాయతీ వ్యవస్థ నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తాం

ఈ పెద్దమనిషి భవన నిర్మాణ కార్మికుల నిధులు వాడుకుని, వారి కడుపు కొట్టారు. ఈయన దొచేస్తో క్లాస్ వార్ అంటాడు, మేమేదో ఆయనకు వ్యతిరేకం అన్నట్లు మాట్లాడతాడు, ఇసుక కాంట్రాక్ట్ అన్ని కేవలం 3 కంపెనీలకు ఎందుకు కట్టబెట్టారు

BC వర్గాలకు ఎందుకు కాంట్రాక్టులు ఇవ్వటం లేదు? కేవలం YSRCP నాయకులకు చెందిన 3 కంపెనీలకు మాత్రమే ఎందుకు ఇచ్చారు

BC వర్గాలకు అభివృద్ధి లేకుండా చేసి ఏదో వాహన మిత్ర అంటూ 10 వేలకు పరిమితం చేశాడు. జనసేన వస్తె BC వర్గాలకు అండగా ఉంటుంది

గతంలో మేము ఇక్కడ వంతాడ మైనింగ్ గురించి మాట్లాడాం, లాట్రైట్ పేరు చెప్పి బాక్సైట్ దొచేస్తున్నరు. నేను మాట్లాడాక ఈ జగన్ రెడ్డి మాట్లాడి, అధికారంలోకి వచ్చాక ఎంక్వైరీ కమిషన్ అన్నారు, ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ రాలేదు

పోలవరం గురించి కేంద్ర మంత్రి గారితో మాట్లాడితే ఆయన చెప్పిన మాట, పోలవరం YSRCP వారికి డబ్బుల మెషిన్ లా మారింది, డబ్బులు అవసరం ఉన్నప్పుడు వచ్చి పోలవరం పేరు చెప్తున్నారు తప్ప పూర్తి చేయడం లేదు అని

సుబ్బారెడ్డి సాగర్ ప్రాజెక్ట్ కోసం కేవలం 5 కోట్లు ఇస్తే పూర్తవుతుంది కానీ ఇవ్వడం లేదు, ఏలేరు రిజర్వాయర్ విషయంలో, పోలవరం విషయంలో ఇలా అన్ని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో YSRCP నిర్లక్ష్యం చూపింది

నిజంగా బీజేపీ మీకు అండగా లేకపోతే భారత ప్రభుత్వం మీ ప్రభుత్వానికి నిధులు ఎందుకు ఇస్తుంది? కట్టుకథలు చెప్పకండి

ముస్లిం మేధావులు బీజేపీ తో కలిసి ఉన్నాం కాబట్టి మాకు అండగా నిలబడం, YSRCP కి అండగా ఉంటాం అంటారు. కానీ బీజేపీ కి అన్ని విషయాల్లో మద్దతుగా నిలబడింది వైసీపీ. మరెలా వారికి అండగా ఉంటారు? నేను ముస్లింలపై దాడి జరిగితే మీ తరపున నిలబడే వ్యక్తిని, కానీ వైసీపీ నాయకులు ఇదే తూర్పు గోదావరి జిల్లాలో ఒక డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వారికి ఎలా అండగా ఉంటారు

100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి 18 దళితులకు అండగా ఉండే పథకాలు రద్దు చేశారు. అలాంటి ఈ జగన్ రెడ్డి కి ఎలా అండగా ఉంటారు ఆలోచించండి, నేను దళితుల సంక్షేమం, అభివృద్ధి కోరుకునే వాడిని

నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయను అని మాటిస్తున్నాను, దయచేసి ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీని ఆశీర్వదించండి, గోదావరి తల్లి సాక్షిగా మీకు అండగా ఉంటాను అని మాటిస్తున్నాను


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *