ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర

జనసేన పాలనలో జవాబుదారీతనానికి పెద్ద పీట వేస్తాం

Share this Post

స్వచ్ఛత, బాధ్యత, పారదర్శకతతో వ్యవహరిస్తాం
జనసేన వారాహి విజయ యాత్రలో భాగంగా కాకినాడ నగర ప్రముఖులు, మేధావులతో భేటీలో శ్రీ పవన్ కళ్యాణ్

‘అద్భుతమైన పోర్టు ఉన్న కాకినాడకు అన్ని విధాలా అభివృద్ధి అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. తీర ప్రాంతం ఉన్నచోట అభివృద్ధి అనేది సహజంగా ఉంటుందని, అయితే అందరి మాటలు విన్న తర్వాత కాకినాడ నగరం అనుకున్నంతగా అభివృద్ధి సాధించలేకపోయింది అని అర్థమవుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పాలకుల తీరు దీనికి ఒక కారణం అయితే, అవినీతిమయమైన నాయకులను ప్రజలు చట్టసభలకు పంపించడం కూడా మరో కారణమని చెప్పారు. శనివారం ఉదయం కాకినాడలో జనసేన వారాహి విజయం యాత్రలో భాగంగా కాకినాడ నగర ప్రముఖులు, మేధావులతో భేటీ అయ్యారు. వారితో పలు అంశాలపై చర్చించారు. “జనసేన పాలనలో స్వచ్ఛత, బాధ్యత, పారదర్శకత, సుపరిపాలన అనే అంశాలనే ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు వెళ్తాం. జవాబుదారీతనానికి పెద్ద పీట వేస్తాం. ప్రజా పద్దులోని ప్రతి రూపాయికి కచ్చితంగా ప్రజలకు లెక్క చూపించే బాధ్యతను తీసుకుంటాం. సహజ వనరుల దోపిడీని పూర్తిగా అరికట్టేలా చర్యలు ఉంటాయి. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి పనులకు బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళ్తాం. సమాజంలో ఉన్న వారందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే నిర్ణయాలు ఉంటాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా అది ఏ వర్గాలను ప్రభావితం చేస్తుందో వారి అందరి నిర్ణయాలు విన్న తర్వాతే ముందుకు వెళ్లాలి అన్న దానిపై జనసేన కట్టుబడి ఉంది. అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, మేధావులుతో పూర్తిస్థాయిలో చర్చిస్తున్నాం. చెప్పే ప్రతి మాటను వింటున్నాం. ఇది కచ్చితంగా జనసేన ప్రభుత్వంలో సుపరిపాలనకు దోహదం చేస్తుందని భావిస్తున్నాను” అన్నారు.


ఈ భేటీకి వచ్చిన ప్రముఖులు, మేధావులు తమ అభిప్రాయాలు, పరిశీలనలు పంచుకున్నారు. ఇసుక దోపీడీ ప్రస్తావనకు వచ్చినప్పుడు ‘ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే నెలకి రూ.30 కోట్లు దోపీడీ సాగుతోంది’ అని ఒకరు చెప్పగానే శ్రీ పవన్ కళ్యాణ్ గారు విస్తుపోయారు. కాకినాడ నగరంలో మౌలిక సదుపాయాలు కొరత ఉందనీ, స్మార్ట్ సిటీ అని ప్రకటించినా ఆ స్థాయిలో సదుపాయాలు లేవని కొందరు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేశ్, పిఏసీ సభ్యులు శ్రీ ముత్తా శశిధర్ పాల్గొన్నారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *