ఆంధ్ర ప్రదేశ్జాతీయంవిజయవాడ

‘షాక్‌’ల సర్కారు వైకాపా!

Share this Post

  • విద్యుత్‌ వినియోగదారుల గగ్గోలు
  • రకరకాల ఛార్జీలతో బండబాదుడు
  • ఏటా రూ. 11,270 కోట్ల అదనపు వసూళ్లు
  • పేద, మధ్యతరగతి వారిపై మోయలేని భారం
    ప్లగ్‌ సాకెట్లో వేలు పెడితే కరెంటు షాక్‌ కొడుతుందని అందరికీ తెలుసు…
    కానీ వైకాపాకి ఓటేస్తేనే షాక్‌ కొడుతుందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది!
    ఎందుకంటే వైకాపా ప్రభుత్వం కొలువైన దగ్గర నుంచి విద్యుత్‌ బిల్లులు నానాటికి పెరుగుతూ షాక్‌ల మీద షాకులిస్తూనే ఉన్నాయి. కొలువైన దగ్గర నుంచి ఎనిమిది సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచిన వైకాపా ప్రభుత్వం నిర్వాకంతో ఇప్పటికే సతమతమవుతున్న జనం, బిల్లుల్లో రకరకాల పేర్లతో విధిస్తున్న అదనపు వాయింపులతో గగ్గోలు పెడుతున్నారు. ట్రూ అప్‌, ఇంధన సర్దుబాటు, విద్యుత్‌ సుంకం, కస్టమర్‌ ఛార్జీలు… ఇలా పేరేదైతేనేం, వేర్వేరు రూపాల్లో పడుతున్న వడ్డనల వల్ల కరెంటు బిల్లులు ఈ నాలుగేళ్లలో నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజలకు వైకాపా ప్రభుత్వానికి ఓటేయడమే, హైటెన్షన్‌ వైరును పట్టుకున్నంత షాక్‌ కొడుతోందని అర్థమవుతోంది.
    ఇలా అదనపు సుంకాలతో విద్యుత్‌ వినియోగదారులపై పడుతున్న భారం ఎంతో తెలుసా? ఏటా సుమారు రూ. 11,270 కోట్లు!
    ఇక్కడితో కూడా ఆగేలా లేదు వైకాపా ప్రభుత్వం. గృహ వినియోగదారులకు రూ. 13 వేల కోట్లు, వ్యవసాయ మోటార్లకు రూ. 6,888 కోట్ల వ్యయంతో స్మార్ట్ మీటర్లను అమర్చబోతోంది కూడా. అంతేకాదు ఇలా గృహ వినియోగదారులకు అమర్చే స్మార్ట్‌ మీటర్ల వ్యయాన్ని కూడా వారి నుంచే వసూలు చేయనుంది. అంటే వాటిని అమర్చాక వచ్చే బిల్లుల్లో స్మార్ట్‌ మీటర్‌ ఛార్జీ కూడా అదనంగా చేరుతుందన్నమాట. మరి వ్యవసాయ మోటార్లకు అమర్చబోయే స్మార్ట్‌ మీటర్ల భారం సంగతేంటి? దాన్ని సైతం ట్రూఅప్‌ ఛార్జీల రూపంలో మళ్లీ జనం మీదనే రుద్దనుంది. వినియోగించుకున్న కరెంటుకు బిల్లు కట్టడంతో పాటు ఇలా రకరకాల ఛార్జీలను సైతం భరించాల్సిరావడాన్ని మించిన భయంకరమైన ‘షాక్‌’ జనానికి ఏముంటుంది?
    ”ఒకసారి పవర్‌ ఇచ్చి చూడండి. నా పవర్‌ ఏంటో చూపిస్తా” అంటూ వైకాపా అధినేత జగన్‌ పాదయాత్రల సందర్భంగా రకరకాల వాగ్దానాలతో ఊరిస్తూ ఊరూరా తిరిగినప్పుడు నమ్మిన జనం ఇప్పుడు ఆ మాటలకు అర్థం ఇదా అని వాపోతున్నారు. ఇప్పటికే ఆస్తి ప‌న్ను, చెత్త ప‌న్ను, ఆర్టీసీ ఛార్జీల పెంపు వ‌ల్ల స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌జ‌లు ఇప్పుడు కొత్త‌గా విద్య‌త్ ఛార్జీల మోత‌ను కూడా భ‌రించాల్సి వ‌స్తోంది.
    “జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇచ్చే అన్ని ప‌థ‌కాల డ‌బ్బు, ఏడాది క‌రెంటు బిల్లుల‌కే స‌రిపోనంత స్థాయిలో విద్యుత్‌ బిల్లులు రావడం దారుణం” అంటూ సామాన్యులు కూడా బాహాటంగానే విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు.
    రాష్ట్ర విద్యుత్తు నియంత్ర‌ణ మండ‌లి చైర్మ‌న్ జ‌స్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, 2021-22 టారిఫ్‌ ఆర్డర్‌ను ప్రకటించే సమయంలో చేసిన వ్యాఖ్య‌లు కూడా పుండు మీద కారం జ‌ల్లిన‌ట్టుగా ఉండి, జ‌గ‌న్ స‌ర్కార్ నైజాన్ని చాటే విధంగానే ఉన్నాయి.
    “పెట్రోలు ధ‌ర‌లు పెర‌గ‌లేదా? గ్యాస్‌ ధ‌ర పెర‌గ‌లేదా? అవి భారం కాదా?” అంటూ వ్యాఖ్యానించడమే కాదు, ”అటు సంస్థలను కాపాడుకుంటూనే ఇటు వినియోగదారులపై కూడా భారం పడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఎంతో కొంత ఛార్జీల పెరుగుదలను ప్రజలు అంగీకరించాలి” అంటూ ముందుగానే హెచ్చరిక సూచనలు చేశారు. ఆ వ్యాఖ్యల ఫలితాన్ని ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారనడంలో సందేహం లేదు.
    ఉదాహరణగా చూడాలంటే… 2019లో విజయవాడలో 0-75 యూనిట్లు వాడిన వినియోగదారుడి నుంచి సగటున యూనిట్‌కు రూ. 1.83 వంతున వసూలు చేస్తే, అదే కనెక్షన్‌పై 2023 మే నెల వాడకం బిల్లులో ఒక్కో యూనిట్‌కు రూ. 3.51 వంతున కట్టాల్సి వచ్చింది. అంటే యూనిట్‌కు రూ. 1.68 అదనపు భారమన్నమాట. ఇందులో శ్లాబుల మార్పు, టారిఫ్‌ల పెంపు, స్థిర ఛార్జీల వల్ల 86 పైసలు పెరగ్గా… ట్రూఅప్‌, సర్దుబాటు ఛార్జీల రూపంలో మరో 82 పైసల భారం పడింది. కేవలం రెండు లైట్లు, ఒక ఫ్యాన్‌ వాడే పేద కుటుంబం కూడా నెలకు 75 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది. వారిపై కూడా నెలకు రూ. 126 వంతున ఏటా రూ.1512 భారం అదనంగా పడుతోందంటే వైకాపా ప్రభుత్వం ఎలాంటి షాకులిస్తోందో వేరే విడమర్చి చెప్పక్కర్లేదు. మే నెలలో వచ్చిన విద్యుత్‌ బిల్లులను పరిశీలిస్తే, ఒక ట్రూఅప్‌తో పాటు రెండు సర్దుబాటు ఛార్జీలు ఉన్నాయి. అవేంటని చూస్తే… 2014-19లో వాడిన కరెంటుకు ట్రూఅప్‌, 2021-22తో పాటు 2022-23లోని ఏప్రిల్‌ నెలకు సంబంధించిన సర్దుబాటు ఛార్జీలు కూడా ఉన్నాయని తేటతెల్లమవుతోంది.
    మరో ఉదాహరణ చూడాలంటే నెలకు 400 యూనిట్లు వాడే వినియోగదారులకు 2019లో ఒక్కో యూనిట్‌పై సగటున రూ. 6.08 వంతున రూ.2432 బిల్లు వచ్చేది. అదే కనెక్షన్‌పై ఇప్పుడు యూనిట్‌కు సగటున రూ. 7.76 వంతున రూ 3,104 బిల్లు వచ్చింది. ఇలా ప్రతినెల అదనపు వసూళ్లను లెక్కేస్తే ఏడాదికి పడే భారం రూ.8,064 అవుతోంది.
  • అధిక భారం సామాన్యులపైనే…
    రాష్ట్రంలో ఇదివ‌ర‌కు క‌నీస విద్యుత్ వినియోగం ప‌రిమితి 50 యూనిట్ల దాకా ఉండేది. వైకాపా ఆధ్వర్యంలో దాన్ని కేవ‌లం 30 యూనిట్ల‌కే ప‌రిమితం చేశారు. అంటే పేద ప్ర‌జ‌లు రోజుకు కేవ‌లం ఒక యూనిట్ మాత్ర‌మే వాడుకోవాలన్నమాట‌. అస‌లే వేస‌వి కాలం కావ‌డంతో ఫ్యాన్ వేసుకోవాల‌న్నా, బల్బు వెలిగించుకోవాల‌న్నా సామాన్యులు ఆలోంచించుకోవ‌ల‌సిందే. ఈ 30 యూనిట్ల వ‌ర‌కు ఉన్న ఛార్జీని సైతం అమాంతం యూనిట్‌కు రూ.1.90 చొప్పున పెంచేశారు. ఓ సామాన్య కుటుంబం 75 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తే, మొద‌టి 30 యూనిట్ల‌కు రూ.1.90 వంతున‌, ఆపై 31 నుంచి 75 యూనిట్ల వ‌ర‌కు యూనిట్‌కు రూ. 3 రూపాయ‌ల వంతున వ‌సూలు చేస్తారు. పైగా ఇదివ‌ర‌కు అమ‌లులో ఉన్న కేట‌గిరీల‌ను ఎత్తి వేసి ఆరు శ్లాబుల‌ను ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌కారం 76 నుంచి 125 యూనిట్లు వాడే వారు ఇక‌పై యూనిట్‌కు రూ.4.50లు; 126 నుంచి 225 యూనిట్లు వాడే వారు యూనిట్‌కు రూ.6లు; 226 నుంచి 400 యూనిట్లు వాడేవారు యూనిట్‌కి రూ.8.75లు; ఆపై వాడేవారు యూనిట్‌కు రూ.9.75లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ శ్లాబుల‌ను గ‌మ‌నిస్తే అధిక భారం మోసేది సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారేన‌ని అర్థ‌మ‌వుతోంది.
  • ఏదో ఒక పేరుతో వడ్డన
    వైకాపా అధికారంలోకి వచ్చాక శ్లాబులు మార్చేయడం, ఛార్జీలు పెంచడంతో పాటు ట్రూఅప్‌, సర్దుబాటు పేర్లతో సాగిస్తున్న వసూళ్ల వల్ల ఈ ఆర్థిక సంవత్సరాన్ని తీసుకున్నా సుమారు రూ. 11,270 కోట్ల అదనపు భారం ప్రజలపై పడింది. 2021-22 టారిఫ్‌ ఆర్డర్‌లో నెలకు 500 యూనిట్ల వినియోగం దాటిన 1.4 లక్షల కనెక్షన్లపై యూనిట్‌కు అదనంగా 90 పైసలు వడ్డించారు. దీని వల్ల ఏడాదికి రూ.1200 కోట్ల భారాన్ని వినియోగదారులు భరించాల్సి వస్తోంది.
    అలాగే 2021 ఏప్రిల్‌ నుంచి గృహ విద్యుత్‌ కనెక్షన్లపై కిలోవాట్‌కు రూ.10 వంతున స్థిరఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ భారం రూ. 300 కోట్లకు సమానం.
    శ్లాబుల మార్పు, టారిఫ్‌ల సవరణ వల్ల ఏటా రూ.1400 కోట్ల భారాన్ని ప్రజలు మోస్తున్నారు. 2022 మే నుంచి వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లకు సుకం కింద వసూలు చేసే 6 పైసలను ఒకేసారి రూపాయికి పెంచారు. దీని భారం ఏటా రూ. 2600 కోట్లు.
    అలాగే 2014-19 మధ్య కాలంలో విద్యుత్‌ కొనుగోలు వ్యయానికి, ఛార్జీలకు మధ్య వ్యత్యాసాన్ని పూడ్చేందుకు ప్రజలపైనే భారం మోపారు. 2022 జులై నుంచి 25 నెలల పాటు రూ. 2910.74 కోట్లు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితం ఈ ఏడాది రూ. 1397 కోట్లకు సమానం.
    అక్కడితో ఆగలేదు… 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.3,082.99 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీల వసూలును గత ఏప్రిల్‌ నుంచి డిస్కంలు ప్రారంభించాయి. ఇంకా 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఇంధన సర్దుబాటుకు కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఒక నెలలో సర్దుబాటు ఛార్జీలను తర్వాతి నెల బిల్లులోనే వసూలు చేస్తారు. అందుకనే ఒక్క మే నెల బిల్లులను బట్టి చూస్తేనే వినియోగదారులపై రూ. 250 కోట్ల భారం పడింది.
    “పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ మెర‌మెచ్చు మాట‌లు విని ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన పాపానికి ఇప్పుడు ఇంట్లో మా ఫ్యాన్ మేం వేసుకోలేని ప‌రిస్థితికి వ‌చ్చాం” అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జ‌నం బాహాటంగానే విమ‌ర్శిస్తున్నారు. చెప్పేదొక‌టి, చేసేదొక‌టిగా ముందుకు సాగుతున్న జ‌గ‌న్ ప్రభుత్వానికి ఇలాంటి విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లే కాదు, సామాన్యుల నిట్టూర్పులు, మూలుగులు సైతం విన‌ప‌డ‌వ‌నేది జ‌గ‌మెరిగిన స‌త్య‌మే!

Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *