జీడి పరిశ్రమ విలవిల!
- తాత్కాలికంగా మూతపడిన ఫ్యాక్టరీలు
- లక్షల ఎకరాల రైతుల్లో కలవరం
- వేలాది మంది కార్మికుల ఉపాధికి గండి
- వందల కోట్ల ఉత్పత్తిపై ప్రభావం
- పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్
ఏరు దాటేవరకు ‘ఓడ మల్లన్న’ అంటూ మాట్లాడి, ఏరు దాటాక ‘బోడి మల్లన్న’ అనేవాడిని ఏమంటారు?
కృతఘ్నడు అంటారు… ఊసరవెల్లి అంటారు… అవకాశవాది అంటారు… కపటి అంటారు…
అధికారం అందేవరకు ‘తియ్య’గా మాట్లాడి, అధికారంలోకి వచ్చాక ‘చేదు’ పనులు చేసేవాడిని ఏమంటారు?
ముఖ్యమంత్రి జగన్ అంటారు!
వేలాది మంది కార్మికులకు, లక్షలాది మంది రైతులకు బతుకు భరోసా ఇస్తున్న జీడిపప్పు పరిశ్రమ పట్ల జగన్ చూపిస్తున్న వైఖరి సరిగ్గా ఇలాగే ఉంది మరి!
ఇదెలాగో తెలియాలంటే 2019లో వైకాపా అధినేతగా, ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్నప్పటి జగన్ మాటల్ని ఓసారి మననం చేసుకోవాల్సిందే…
”ముఖ్యమంత్రి అంటే రైతులకు గిట్టుబాట ధర ఇప్పించేందుకు తపించాలి. దళారీ వ్యవస్థను తొలగించడానికి ఆరాటపడాలి…” అంటూ ఓ గొప్ప నిర్వచనాన్ని జగన్ పాదయాత్రలు చేస్తూ వ్రాక్కుచ్చారు. అప్పట్లో జీడిపప్పు పరిశ్రమ గురించి, జీడి రైతుల దుస్థితి గురించి ప్రస్తావిస్తూ అనేక హామీలు గుప్పించారు.
అదే జగన్ ముఖ్యమంత్రిగా మారి ఇప్పటికి నాలుగేళ్లు అయింది. ఇంతకాలంగా జీడి రైతుల స్థితిగతులను మెరుగుపరచడానికి కానీ, గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ, దళారులను దూరం చేయడంలో కానీ, జీడి పరిశ్రమలకు ఊతమివ్వడానికి కానీ… ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
ఈ నిర్లక్ష్యానికి, ఈ ఉదాసీనతకి, ఈ నిష్క్రియాపరత్వానికి… ఫలితం ఏంటో తెలుసా? - రాష్ట్రంలో 550 పరిశ్రమలు ఈ నెలాఖరు వరకు మూతబడ్డాయి!
- 3.33 లక్షల ఎకరాల్లో జీడిమామిడి సాగు సంక్షోభంలో పడింది!
- లక్షలాది మంది రైతులు అగమ్యగోచర స్థితిలో పడ్డారు!
- ఎకరానికి రూ.15 వేల వంతున నష్టం కలిగే దుస్థితి ఏర్పడింది!
- 30 వేల మంది కార్మికుల ఉపాధికి గండి పడింది!
- జీడిపరిశ్రమపై పరోక్షంగా ఆధారపడిన లక్షలాది మంది బతుకులు అస్తవ్యస్తమవుతున్నాయి!
- ‘తెల్ల బంగారం’ వెలవెల
జీడిపప్పును తెల్లబంగారంగా పిలుస్తారు. దాన్ని సాగు చేయడంలో, బాగు చేయడంలో, జీడి పిక్కలను వేరు చేయడంలో, రవాణా చేయడంలో అనేక దశల్లో దాని మీద ఆధారపడి లక్షలాది మంది జనం బతుకుతున్నారు. జీడిమామిడి పంట నుంచి వచ్చే పిక్కలను ప్రాసెస్ చేయడం ద్వారా వందలాది పరిశ్రమలు జీడిపప్పును ఉత్పత్తి చేస్తూ నిత్యం లావాదేవీలతో నడుస్తుంటాయి. ఈ పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులుగా జీవనం గడుపుతుంటారు. ఇంతటి ప్రాముఖ్యమున్న జీడి పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా పేరు పొందింది. ఇక్కడ ఉత్పత్తయ్యే జీడిపప్పు మంచి నాణ్యతతో ఉండడమే ఇందుకు కారణం. రాష్ట్ర వ్యాప్తంగా 550 జీడిపప్పు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. జీడి పరిశ్రమలకు ఏటా 80,000 మెట్రిక్ టన్నుల జీడి పిక్క అవసరమవుతుంది. ఇంత డిమాండు ఉండగా జీడిమామిడి పంటపై ఆధారపడిన రైతుల పరిస్థితి మాత్రం నానాటికి తీసికట్టులా తయారైంది. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో, సాగు విస్తీర్ణాన్ని పెంచడంలో, దళారుల వ్యవస్థను తప్పించడంలో జగన్ ప్రభుత్వం చేష్టలుడిగిపోవడంతో రాష్ట్రంలో మొత్తం జీడి పరిశ్రమే సంక్షోభంలో చిక్కుకుపోయింది. రాష్ట్రంలో పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామారాజు, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, విజయనగరం, వేటపాలెం ప్రాంతాల్లో దాదాపు 3.3 లక్షల ఎకరాల్లో జీడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. జీడిపంటపై సుమారు 1.86 లక్షల రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఈ రైతులు అంతకంతకు నష్టాల్లో కూరుకుపోతున్నా, జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైకాపా ప్రభుత్వానికి ముందు 80 కిలోల బస్తా జీడి పిక్కల ధర రూ.15,000 ఉండగా, ఇప్పుడది సగానికి సగం తగ్గిపోయి రూ.7000కి పడిపోయింది. సాగు ఖర్చులు పెరిగిపోవడంతో సగటున బస్తాకు రూ.16,000 వస్తే కానీ గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది. జీడి పిక్కల ధర పతనంతో ఎకరాకు రూ. 15,000 వరకు నష్టం వచ్చే దుస్థితిలో రైతులు పడిపోయారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించమని రైతులు ఎంతగా కోరినా జగన్ తగిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. డిమాండుకు తగినంత పిక్క స్థానికంగా లభించక జీడి పరిశ్రమదారులు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పిక్కల పైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే ఆ జీడిపిక్కల నుంచి వచ్చే జీడిపప్పు నాణ్యత సరిగా ఉండడం లేదు. మరో వైపు విద్యుత్తు బిల్లుల నుంచి అన్ని ఖర్చులూ పెరగడంతో జీడి పరిశ్రమలు సంక్షోభంలో పడ్డాయి. దీనికితోడు గత ఏప్రిల్ నుంచి అన్ని రకాల జీడిపప్పు ధర కిలోకు రూ.100 వరకు తగ్గిపోయింది. కేరళ, మంగళూరు నుంచి జీడిపప్పు విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఆర్థిక మాంద్యం కారణంగా అక్కడ వినియోగం తగ్గడంతో కొంతకాలంగా ఎగుమతులు మందగించాయి. దీంతో ఆ నిల్వలు దేశీయ మార్కెట్ కు వెల్లువెత్తడం, ఆషాఢం నేపథ్యంలో శుభకార్యాలు లేక స్థానికంగా వినియోగం తగ్గడం కూడా ధరలు పడిపోవడానికి కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలను నడపలేక, భవిష్యత్తులో జీడి పప్పు ధర పెరుగుతుందన్న ఆశతో రాష్ట్రంలోని 550 పరిశ్రమలను ఈ నెలాఖరు వరకు మూసివేయాలని పారిశ్రామికవేత్తలు నిర్ణయించారు. అయినా వారిని పిలిపించి మాట్లాడాలనే కనీస బాధ్యతను ముఖ్యమంత్రి తీసుకోలేదు. అటు పరిశ్రమదారుల, ఇటు రైతుల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ఎలాంటి చర్యలనూ తీసుకోలేదు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో దాదాపు 450 శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. పలాస, కాశీబుగ్గ, మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో 350 పైగా పరిశ్రమలు ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 4 వేల బస్తాల జీడిపిక్కల నుంచి 100 టన్నుల వరకు జీడిపప్పు ఉత్పత్తి అవుతోంది. దీనిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.25 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలోని జీడిపప్పు పరిశ్రమ ద్వారా జరిగే సాగు, రవాణా, ఉత్పత్తి, ఎగుమతుల ద్వారా ఏటా 1500 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. అయినా ఈ పరిశ్రమకి జగన్ ప్రభుత్వం నుంచి ఉదాసీనతే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో పలాస ప్రాంతంలోని పరిశ్రమలను ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించుకున్నారు. దీని వల్ల ఎలా లేదన్నా రూ.200 కోట్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది.
- స్థానిక జీడిరైతుల నుంచి పిక్కల సరఫరా తగినంతగా లేకపోవడంతో పరిశ్రమదారులు విదేశాల నుంచి పిక్కలను తెప్పించుకోవలసి వస్తోంది. ఆ పిక్కల ధర తక్కువగా ఉండడంతో స్థానిక రైతులకు అంతకు మించి ధర చెల్లించడానికి విముఖత చూపిస్తున్నారు. నిజానికి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పిక్కల ద్వారా ఉత్పత్తయ్యే జీడిపప్పు నాణ్యత సరిగా ఉండకపోవడంతో జీడిపప్పు ధరలు కూడా నానాటికీ తగ్గుతున్నాయి. అదీకాక విదేశీ పిక్కల ద్వారా బస్తాకు 16 కిలోల జీడిపప్పే ఉత్పత్తి అవుతుంది. స్థానికంగా లభించే జీడిపిక్కల నుంచి బస్తాకు 24 కిలోల వరకు పప్పు వచ్చే అవకాశం ఉన్నా ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో పరిశ్రమల వారు అధిక ధరలను ఇవ్వలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టి సారిస్తే విదేశీ దిగుమతులను నియంత్రించే అవకాశం ఉంటుంది. అయితే జరుగుతున్నదేమిటంటే గుట్కా, రంగుల తయారీ, చర్మశుద్ధి కర్మాగారాల్లో ఉపయోగపడే జీడిపొట్టు పేరు చెప్పి అనధికారికంగా విదేశీ పిక్కలను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. సరైన నిఘా, నియంత్రణ కొరవడడంతో ఇది జీడిపరిశ్రమనే ప్రమాదంలోకి నెట్టివేస్తోంది.
- మరోవైపు జీడిపప్పు ఎగుమతి కూడా వేర్వేరు కారణాల వల్ల తగ్గుతోంది. కేరళ, మంగుళూరు నుంచి జీడిపప్పును విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఇతర దేశాల్లో ఆర్థిక మాంద్యం కారణంగా ఆ ప్రభావం జీడిపప్పు ఎగుమతులపై పడింది.
నిజానికి ఈ పరిస్థితులను గమనించి అటు రైతులకు, ఇటు పరిశ్రమదారులకు నష్టాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. అందుకు ఉదాహరణగా కర్నాటక రాష్ట్రాన్ని చెప్పుకోవచ్చు. అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల జీడిపప్పు ఉత్పత్తి 35 శాతం వరకు పెరిగింది. విదేశీ పిక్కల అనధికార దిగుబడులను నియంత్రించడం, రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడడం, దళారుల వ్యవస్థను దూరం చేయడం, నిల్వల రూపంలో ఉండిపోయిన జీడిపిక్కలను మార్కెట్లోకి వచ్చేలా చేయడం, పరిశ్రమలకు కొన్ని రాయితీలు కల్పించడం, స్థానికంగా జీడిమామిడి సాగు విస్తీర్ణం పెరిగేలా చేయడం, ఆ మేరకు రైతులకు భరోసా కల్పించడంలాంటి చర్యల ద్వారా చాలా మటుకు జీడిపరిశ్రమను గట్టెంక్కించవచ్చు. అలాగే తిరుపతి సహా ఇతర దేవస్థానాల్లో విరివిగా వాడే జీడిపప్పును స్థానికంగా కొనుగోలు చేసేలా చేయవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా ఆదుకోవచ్చు.
అయితే… మాటలు తప్ప చేతలు లేని జగన్ ప్రభుత్వం అందుకు పూనుకుంటుందన్న ఆశలు ఎవరికీ లేవు.
